54 సార్లు అమెరికా వచ్చాను.. కేంద్రం మీ చేతుల్లోనే ఉందిగా దర్యాప్తు చేసుకోండి: అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శివాజీ

  • ‘ఆపరేషన్ గరుడ’పై భుజాలు తడుముకుంటున్న వైసీపీ
  • నాకు రెడ్ కార్నర్ నోటీసు ఇస్తారా, ఎందుకో?
  • నేనేమీ రుణాలు ఎగ్గొట్టి అమెరికా రాలేదు
అమెరికాలో ఉండి ఏపీ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సినీ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ‘ఆపరేషన్ గరుడ’ విషయంలో తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్పానన్నారు. వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో తెలియడం లేదన్నారు. వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు ఆపాలని హితవు పలికారు.

ఆపరేషన్ గరుడలో ఏం జరగబోతోందని తాను చెబుతున్నానో, వైసీపీ నేతలు దానిని నిజం చేస్తున్నారని అన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నారని, ఎందుకు పెట్టాలో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని, రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. తానేమీ కొందరిలా రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోలేదన్నారు.

తనకు ముఖ్యమంత్రి చంద్రబాబే డబ్బులు ఇచ్చి అమెరికా పంపారని అంటున్నారని, తాను ఇప్పటి వరకు 54 సార్లు అమెరికా వచ్చానని పేర్కొన్న శివాజీ అవసరం అనుకుంటే తన వీసా చెక్ చేసుకోవచ్చని సవాలు విసిరారు. అంతేకాదు, కేంద్రం వైసీపీ చెప్పినట్టు వింటోంది కాబట్టి, మోదీ వారి చేతుల్లోనే ఉన్నారు కాబట్టి తమకు ఇష్టం వచ్చిన దర్యాప్తు చేసుకోవచ్చని శివాజీ పేర్కొన్నారు.
Go Back to Shorts
Actor
Shivaji
Andhra Pradesh
Operation Garuda
YSRCP
Narendra Modi
BJP

More Telugu News